Monday, July 16, 2018


                  కవిత్వానువాదం - మన కవులు                                               

                                  


ఆశారాజు            “మనిషైతే గాని కవిత్వం రాయలేడు..సురేషూ!...కవిత్వం అంటేనే ప్రేమ”  అని కవి ఆశారాజు నిన్న రాత్రి ఫోన్ లో నాతో ఆప్యాయంగా  అనడం తో అప్రయత్న౦గానే “వాహ్” అన్నాను.  
ఈ వారం ఆయన కవిత ను ఆంగ్లం లోకి అనుసృజన చేయాలని, ఆయన అనుమంతి కోసం ఫోన్ చేసాను. రాత్రి బాగా పొద్దు పోయింది. ఒక గంట పాటు ఆత్మీయ కవిత్వ సంబాషణ మా ఇద్దరి మధ్య సాగింది.  ఒక్క క్షణం కూడా ఆయన లో విసుగు కనిపించలేదు. ఒక గంట పాటు జరిగిన సంబాషణ లో ... 18 సంకలనాలు అచ్చు వేసినా, కేవలం మూడింటికి  మాత్రమే ఆవిష్కరణ సభలు పెట్టాను... అని ఆయన అన్నప్పుడు మాత్రం ఆయన మాటల్లో ఏదో సన్నని బాధ కనిపించింది. ఇక అంతా అమితోత్శాహమే ! కవిత్వం పై మాట్లాడుతున్నంత సేపూ, ఆయనలో ఒక పెద్ద ఉత్సాహం.. గొప్ప ఆసక్తి... ఇంకా ఏదో చెప్పాలన్న ఆరాటం చూసాను. ప్రతి సారీ సురేషూ ...సురేషూ అని పిలుస్తుంటే ..తెలియని ఆత్మీయతొకటి గుండెల నిండా పరుచుకొంది.... 
..
           కవిత్వం పై ఆయన ఆసక్తి ఆయన మాటల్లోనే...
         ఏమో సురేషూ నాకైతే కవితల్లో కవిత్వం లేకుంటే అస్సలు నచ్చదు. ఒకటి చెప్పు.... !ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా చంపే కత్తి కి నగిషీలు చెక్కిన ఒర..., వజ్రాలో.. సింహపు బొమ్మో చెక్కిన పిడి...అందంగా కనిపించే ఆ చేమికీలు ఎందుకు పెడతారంటావు.? ప్రతి దానికి ఓ నగిషీ అవసరం.. మన భావనలకు .. మన భావోద్వేగాలకు  నగిషీ లాంటిదే  కవిత్వం.! చెప్పేది అందంగా ఉండాలి. శైలి, నడక కొత్తగా ఉండాలి. 
సురేషూ...”నేపధ్యం”  అనే నా కవితా సంకలనం ఆవిష్కరణ లో సి.నారాయణ రెడ్డి గారు వచ్చారు.  వేదిక పై నుండి మాట్లాడుతూ,    చూడు ఆశారాజు...నేను కళ్ళు మూసుకొని  సంకలనం లోని ఒక పేజి ని తెరుస్తాను. అందులో కవిత్వం కనిపించక పోతే, వెంటనే వేదిక పై నుండి దిగి పోతాను.”  అన్నాడు. అదే చేసాడు. చూసాడు. అద్బుతంగా ప్రశంసించాడు.  
           మొదట్లో నేను కవిత్వం కేవలం అవసరార్థం రాసేవాడిని. కే. శివారెడ్డి గారు మాకో ఉస్మానియా లో జాయిన్ అయినప్పుడు , ఆయనకు నేను దగ్గరవుతో వచ్చాను. అద్బుత సాహితీవేత్త, విశ్లేషకుడు.కే.కె.రంగనాథ చారి తమ్ముడు బుచ్చిబాబు నాకు  చాల సన్నిహితుడు. చాల మంది కవులు శివారెడ్డి గారి ఇంటికి వచ్చే వారు. ఉస్మానియా రైటర్స్ అసోసియేషన్ కవులంతా ద్వారక హోటల్ లో  వచ్చే వారు.  కలిసేవాడిని..వాళ్ళ ప్రతిబ కవిత్వం నన్ను కవిత్వానికి దగ్గర చేసింది. ఉర్దూ సాహిత్యం పైన నాకున్న మక్కువ, అభినివేశం నాతో  కవిత్వం రాయించడానికి సన్నాహం చేసింది. నాకంటూ ఒక డిక్షన్ ఏర్పాటు చేసుకొన్నాను. 1987 లో చార్మినార్ నుండి వస్తుంటే, ఒక bus లో గుడ్డివాడు ఉర్దూ లో “ నా కళ్ళ మీద పరదా లేదు...”  అని పాడిన పాట నన్ను వెంటాడింది. ఆ పాట కు inspire అయ్యి ఒక కవిత రాసాను. “ మనిషే పాడినట్లు..అన్న కవిత  రాసి, ఆంద్ర జ్యోతి కి పంపినాను. అచ్చయింది. అద్బుతమైన పేరు వచ్చింది. నారాయణ రెడ్డి గారు  ఒక ఏడాది పాటు ఆ కవిత గురించి, ప్రతి సభ లో చెప్పేవారు. అప్పటి నుండి ఆరాటం మొదలయింది. అమ్మ పైన రాసిన ఒక కవిత ఆంధ్ర జ్యోతి లో అచ్చయింది.  కొన్ని వేల మంది అమ్మలు ఆంధ్ర జ్యోతి కి ఉత్తరాలు రాసారు. దేవిప్రియ గారు నన్ను ఆంధ్ర జ్యోతి ఆఫీస్ కి పిలిచి, ఉత్తరాలు చూపించారు. మరుసటి రోజు నా ఫోటో వేసి, అమ్మ కు ఆదరణ అనే ఒక కాలం రాసారు. పొంగిపోయాను.  సురేషూ , నేను ఎప్పుడూ కవిత్వం  లో నీరస పడలేదు. నాకు ఒక ఇమేజ్ ఇచ్చింది. ఒక పేరు ఇచ్చింది. ఒక స్థాయి ఇచ్చింది. ఒక అద్బుత మైన కీర్తి  ఇచ్చింది. నా జీవితం లో కవిత్వం నా సర్వస్వం . నేను లేని సభల్లో సైతం నా గురించి పొగుడుతుంటే,  ఒక అవ్యక్తానుభూతి పొందాను.  ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు , సినారే సాహిత్య పురస్కారం, తెలుగు యూనివర్సిటీ వారు ఇచ్చే సాహితీ పురస్కారం వచ్చాయి. ప్రతి పోయెమ్ నాకు ఒక త్రిల్.
...    
             ఆధునిక కవులు.. కవిసంగమం గురించి....!
        ఒకటి చెప్పనా సురేషూ.....అసలు ఇలా నేనెందుకు రాయలేక పోయా ... అని అనుకొనేలా రాస్తున్నారు. కవిసంగమం వారం వారం శీర్షిక లలలో అద్బుతంగా విశ్లేషిస్తున్నారు. కవిత్వం ఒక యజ్ఞం లాగా చేపట్టారు. అన్ని పోయెమ్స్ బాగా లేక పోవచ్చు.  సురేశూ.. ఎక్కువ రాయాలన్న ప్రయత్నం లో కవిత్వం పలచ బడుతుంది.  ఒకటి చెప్పనా సురేశూ....ఒక్క "షేర్ " అంటే నాలుగు లైన్స్  ఉర్దూ లో రాసేందుకు  ఒక్కో కవికి కొన్ని నెలలు పట్టేదట. “నదులన్నీ సముద్రం లో మునుగుతాయి... సముద్రం కన్నీటి బిందువులో మునిగి పోతాది..”   ఈ నలుగు వాఖ్యాలు రాయడానికి కొన్ని నెలలు పట్టిందంటే నమ్ముతావా?  
.ఇంకోటి చెప్పాలి సురేష్....పెద్దవాళ్ళ గురించి, సాటి కవుల గురించి  విమర్శించడం , కామెంట్ చేయడం మానుకోవాలి. ఎదుటివారికి గౌరవాన్ని ఇచ్చినప్పుడే కవిత్వం రాయగలవు. ఏదో ఒక అకారణ అసూయ నో, ద్వేషమో అభివృద్ధి చెందకూడదు. కవివంగమం అద్బుతం.   పరేష్ దోషి  కి నాకు అద్బుతమైన సాహిత్య౦, సంగీతం లో పోలిక ఉన్నాయి. 
          సాహిర్ లుదియాని  నా అభిమాన కవి. పరేష్ దోషి ఒక అద్బుత కవి. ఆయనకు కూడా సాహిర్ లుదియాని అంటే అభిమానం.  
          సురేషూ  ... ఆధునిక కవులకు ఏమైనా చెప్పే౦త స్థాయి లేదు కానీ,  కోత్హగా రాయాలి. మనకంటూ ఒక డిక్షన్ ఏర్పాటు చేసుకోవాలి.  ఇంతవరకూ చెప్పగలను. 
సురేషూ,.. ఈ రాత్రి నాకు నీతో జరిగిన సంబాషణ జీవితం లో  మరిచిపోలేని రాత్రి...అని ఆయన  సంతోషంగా చెపుతుంటే, ఆయన ఒక అద్బుత వ్యక్తి గా నాకు ఆవిష్క్రుతమయ్యారు. 
-------------
                                       ఆశా రాజు  || గుంపు లో కలిసే దాక నడుద్దాం||
ఆంగ్లం లోకి  అనుసృజన : సి.వి.సురేష్ || let us walk till we mingle in shoal  ..!|

What else there for me…
To stare?
What else strikes me..
To do?
All that having was…. 
Totally evanished! 
Where else I quest…
For love !?
How can I tie up…
The bonding…?!
sloped and searched their own ways
with  secede hands …!
..
Who will align…
in this dark murk!?
whoever  will identify…
in those masks…!
..
Calling with no reciprocation…
Retorting with no Clatter..
Moving With no  destination 
No little light around in any turn…!
What’s up here..like  strangers…,
May be with an  Illation journeys..?!
..
Even the siblings
Or even those symbiosis 
May be unknown
         *   *   *        


                          

                                                                                   

Monday, July 9, 2018

కొ న్ని జ్ఞాపకాల చివర

                        
|| కొ న్ని జ్ఞాపకాల చివర ||

సి.వి.సురేష్

ఎప్పటిలాగే...
విరిగిన ఒక జ్ఞాపక౦ మళ్ళీ అతికి౦చుకొ౦టు౦ది
అది శరీరాన్ని కానీ, 


మనసును కానీ చేరే ప్రయత్న౦ అప్రయత్న౦గానే

సరె!
ఏ ఒక్క జ్ఞాపకమైనా స౦తోషాన్నిచ్చి౦దా?
సముద్రమ౦త వ్యధను నీపై తోయడ౦ మినహా

వెలుగు రేఖలు నిరాశగా కన్నీళ్ళు కార్చడ౦
ఉపశమనాల ఊరటగా భావిస్తున్నావ్

2

ఎన్నోసార్లు నీలోకి నీవే
కా౦తికిరణాలేవి చొరబడన౦త చీకటిని ప౦పేశావు!
అనుభవమొప్పుడూ
తీర౦ వైపుకు లాగే విఫలయత్న౦ మునుపటి లాగే

వ్యధను కప్పేసే పెదాలు
ఎప్పుడూ ఒక చిరునవ్వును నిల్వ ఉ౦చడ౦
తప్పి పోవాలి ..
తప్పిపోవాలి ....

ఆలస్య౦గా నైనా సరే
ఎలాగైనా నీవు తప్పుకోవాలి!!!

@ సి.వి.సురేష్ 
నా కవిత కలెక్షన్ ల నుండి

గీ తి క || గీ తి క ||
సి.వి.సురేష్
అవని పైనున్న ఏ అందాలైనా ...
అవి ఆమె ఇష్టపడితేనే 
వాటికి ఆ సౌరభమూ,
ఆ గొప్పతనమూ వస్తాయని భావిస్తాను!
...
నా సజీవ‌ ప్రేమ లో
నన్నో షాజహాన్ గానో,
శరత్ దేవదాసు గానో ఊహి౦చుకొ౦టాను
...
ఆమె పై అద్భుతమైన నా ప్రేమను
ఓ ఇలియాట్ లాగనో
డికెన్‍సన్ లాగనో
అస్కార్ వైల్డ్ లాగనొ
ఈ యువ జగత్తుకు కవితా రూపంలో రాసి

 వినిపించాలని ఉంటుంది.
....
ఇంకా నా ప్రేమ ను
విశ్వప్రేమికులంతా ఆదర్శంగా 

తీసుకోవాలనిపిస్తుంది
....
సరే, ఈ మాటలు ఎక్కడైనా నేను ప్రస్తావిస్తే
నా మానసిక స్థితి ని అనుమానిస్తారేమో అన్న

 భయం కూడా లేకపోలేదు..

నా ఈ సందేహం నా ప్రేయసినె అడిగి తెలుసుకోవాలని

నిర్ణయాని కొచ్చా!

ఏది ఏమైనా సరే నా ప్రేమ ఎజెండా పుష్పగుచ్చాలతో మలచాలని..!


నన్ను నేను సమర్థి౦చుకొ౦టాను....
అది నాకూ సబబే అని రూడీగా నిర్ణయించేసా!
....
నా ఈ మార్పులన్నిటి వెనుక కారణం కోసం
నా పదహారేళ్ళ ప్రాయం నుండి ఇప్పటి దాకా శోధిస్తూనే ఉన్నా.!

॥......... ॥

॥......... ॥

సి.వి. సురేష్

నాలో నిరీక్షణ క్షణాలను
కనురెప్పల అ౦చులను౦డి జారకము౦దే
అ౦దుకొ౦టావు క్షితిజరేఖలా....

హృద్య౦తరాలల్లో మార్మోగే స౦గీతాన్ని
నా మనసు పాడకము౦దే
మధుర గాయనిలా ఆలాపన౦దుకొని ఆహ్లాది౦పచేస్తావ్!

ముని వ్రేళ్ళతో సవరిస్తూ..
హృదయాన్ని కదిలి౦పచేసే
ఓ రసరమ్య భావన్ని నాలోకి జారవిడుస్తావు

....
ఎన్నో ఏకా౦తల మద్య
అన౦తమైన నా ప్రేమను నిరూపి౦చే సమయాలు
నీ ము౦గిట వేచిఉన్నాయి..

కొన్ని పూర్తికాని పల్లవిలు....ఇ౦కొన్ని భావావేశాలు...
బహిర్గతమవుతున్నాయ్..
నీ మౌన పరిభాషల‌ తాకిడిలో.....!

...
అద్భుతాల సమాగమైన నీకో
కవిత అ౦కితమివ్వాలన్నది నా కోరిక !!

('తొలిఅడుగులు"...నా కవితల కలెక్షన్ ను౦డి)

హృదయ భాష్పం
 // హృదయ భాష్పం //
సి.వి.సురేష్

నీకై
నిరీక్షి౦చే నా కళ్ళకు తెలుసు....
ఎన్ని రుతువులు ఓదారుస్తూ తన ముందే వెళ్ళిపోయాయో?
కరిగిన కాలానికి తెలుసు
నాలో ఘనీభవి౦చని హిమపాతాలెన్నో...
....
ఈ ఉదయ స౦ధ్యలను అక్కున చేర్చుకొనే రాత్రికి తెలుసు
నాలోనే ఇమిడిన ఆ చీకటి పాట ఆలాపనలు!
..
ఆర్ద్రమైన నా హృదయ ఘోషకు
మూతపడని నా కనురెప్పల ఓదార్పులు
నీ ధ్యాసల్లో ఇగిరిపోతున్న క్షణాల్లో
నా కొన ఊపిరిని తీసుకెళ్ళే "ఆ చివరి క్షణ౦" చిక్కుకొనే ఉ౦ది
చప్పుడు చేయకు౦డా
రాలిపడే ఆకుల కన్నీటివెతలు ఏ తడి గు౦డెకో ఎరుక......!!!
...
(కవిత్వపు తొలిరోజుల్లో...మురిసిపోయేవాడిని..ఈ వచనపు వాక్యాలు చూసి)

ఒక రాతిరి..// ఒక రాతిరి...//
సి.వి.సురేష్
ఎక్కడికని ఈ రాతిరి నిను తీసుకెళ్తుంది..?
కొన్ని కలల పచ్చితనాన్ని 
ఇంకొన్ని ఆరాటాలనీ..
గదుల్ను౦డి గదుల్లోకి మారుస్తూ...
స్వర్గ స్రావం లోకి మోసుకెళ్తుందా..?
.
జ్వలిస్తున్న నేత్రాలలో కటిక చీకట్లు..
కాంక్షిస్తున్న ముద్ర ల్లో ఖాళీ గదులు
మూయని రెప్పల గుండా.
దొర్లని క్షణాలు...
రెప్ప మూసినా కదలని ఆలోచనల కదంబాలతో ...!
ఎక్కడికని ఈ రాతిరి నిను చేరుస్తు౦ది.?
.
ఆలోచనల పొరలను గుచ్చి బాదించే
నక్షత్ర కాంతుల ముల్లులు ...
వెన్నెల మంటలో ఎర్రగా కాలే
ఆ దేహపు కమురు వాసనలు....
ఎంత సేపని ఈ రాతిరి నిను బాదిస్తుంది?
.
నీడల్లా పరచుకొన్న శబ్ద ప్రవాహం...
నిశ్శబ్ద నిశీధి నుండి కొమ్మల మీదుగా
ఒక్కో చీకటి బొట్టూ....
దాటు కొచ్చిన రాతిరి
నిన్నేతీరం వైపుకు సాగనంపుతుంది!?
.
2
లోలోపలనే
పారి, ఘనీభవించిన సముద్రాలు
చుట్టూ..
చేతులు జాపిన మరణ మాయ
వెయ్యిన్నూట రెక్కలతో స్వప్న తీరాలను చేర్చే..
ఈ కటిక రాతిరి...
నిన్నిలా ఆవహించక పోతుందా?
.
3.
కరిగే కాలం నుండి కారే చీకటి..
నిన్నో స్థితి నుండి అస్తితి కి జారవిడిచి
రహస్య బాష లను గొంతు స్నాతం లోకి ది౦పుతూ..
పాడే రాతిరిపాట నిన్నే లోకం లోకి చేరుస్తో౦ది?
.
4
ఊపిరి ఆగాక సాగిల పడే
కరుణ,...
కడదాకా..... కదిలి ...
నిన్నో చిక్కటి రాతిరి లో కప్పెట్టేయదా?

మ ర ణే చ్చ


|| మ ర ణే చ్చ ||
సి.వి.సురేష్ 

ఇక్కడ అంతా 
అనుకొన్నది అనుకోన్నట్లే జరిగిపోతుంది 
.....
పీల్చే గాలులు 
రెండుగానో మూడు గానో..
నిలువునా చీలిపోతాయ్
చీకటిలో తెగిపడిన మనసులు
చస్తూకూడా మరణసుఖాన్ని పొందలేన౦తగా.....!
....
అమాంతంగా వ్యాప్తమయ్యే
బిందువు లేని వృత్తమొకటి
మతాల మూలుగులను
కలిపి కుట్టేయలన్న ఆలోచన తో సాగుతుంది..
సిరదమనుల్లో పవిత్ర జలాలు
శుద్ది చేయబడుతుంటాయి
.....
సూది దూరనంత బెజ్జం లో
అసత్య అర్ధరహిత కుటిలత్వమేదో మతం ముసుగులో
ఆసిడ్ వికృత మరకల్ని వదిలి వెల్తు౦ది
....
దీనంగా గుమ్మం లో పడిన నేటి పత్రికలు
అసహనపు రాతలన్ని మోసుకొచ్చి చెదిరిన ముగ్గులా
జీవన భయ విహ్వలత ను
ఇంటి గుమ్మాలకు తగిలిస్తు౦టాయి..
.....
అరణ్యాన్ని కార్చిచ్చుకు అప్పచేప్తారు
ఎముక మూలుగల్లో
ఏమేమో రగుల్చుకొంటాము
ఉన్న ఒకే ఒక్క పావుర౦
యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలనుకొంటుంది
....
హృదయోర్ముఖాలు పగలగొట్టి
మరణేచ్చను
ఇప్పుడు హెరిడిటి గా అందిస్తారు..
...
అంతా..
సవ్యంగానే సాగుతుంది..అనుకొన్నది అనుకొన్నట్లే!!!

విరామ దుఖం || విరామ దుఖం || 

సి.వి.సురేష్

బ్రతుకు దుఃఖమేదైనా మిగిలి ఉంటే 
నూలు స్వెట్టర్ లో వెచ్చగా చుట్టేసి
తీరపు అంచున కూర్చొని
ఒక్కో దుఖాన్ని జారవిడిచే నగ్న నేత్రం.....!
..
..
షరా నవ్వుల మర్మాన్నో....
కన్నీటి ద్వైభాషల అర్థాలనో ఆరాలు తీసీ..తీసి
అలసిన ఆకుపచ్చ మైదానం...
జీవిత నాటకపు చివరి అంకాన్ని 

ట్రాజెడీ గా మార్చాలో? కామెడి గా మలచాలో ?
అర్థం కాక అర్ధా౦త౦గా వదిలేసిన ముగింపు
..
..
దంకన్ స్టీల్,
నోస్టర్ డమాస్, అమియోబ్ ల యుగా౦తపు రహస్యద్వారాల
అన్వేషణలొక వైపుగా..
వేల కోట్ల పడగల సాగరాన దాహార్తియై
చివరకు ఎం మిగిలిందన్న నిర్వేదం మరొక వైపూ...
అనుభవిస్తూ ఆ నిస్తేజమైన కళ్ళతోనే
మహా స్మశానాన గడిపుతున్న సుదీర్ఘ రాత్రులు!!
..
..
2
బ్రతుకు కీళ్ళ సందుల్లోన
గతం ఆడిన కీలుబొమ్మల ఆటల జ్నాపకాల పెను బాధ!
విశ్రాంత దేహాన్ని
అక్కున చేర్చుకొనే తీరం...
తన ఒడ్డున సేద తీరే ప్రతి చివరి క్షణాన్ని పంచుకొంటుంది.....!!!ఏం మిగిలిందంటావ్ ? || ఏం మిగిలిందంటావ్ ? ||
సి.వి.సురేష్

అట్లా అని వెనుక
పెద్దగ మిగిల్చి౦దీ ఏమీ లేదు 
మహా అయితే 
ఒకరి నొకర౦ తరుముకొంటూ 
ఒకరిలో ఇ౦కొకరం వాన గా చేరి తడుపుకొవడ౦ మినహా..!
..

ఇంకా చెప్పాలంటే 
కొన్ని సార్లు కొడిగట్టిన చమురు దీపాల్లా 
ఇంకొన్ని సార్లు దీపపు పురుగుల్లా.....
ఏడుస్తూ వచ్చి 
ఇచ్చే సంతోషాన్నీ క్షణికం చేసి 
ఏడిపిస్తూ వెళ్ళిపోయే బంధాలనూ క్షనికాలే చేయడం తప్ప !
వెనుక
పెద్దగ మిగిల్చి౦దీ ఏమీ లేదు !

......

అట్లా అని
మిగిల్చిన జ్ఞాపకలూ ఎమీ లేవు 
మహా అయితే
అల తీరాన ఒదిలి పెట్టిన నురగ లాగా
గిరిటాలు కొడుతూ ఎగిరే గాలిపట౦లొ 
కేరింతలు కొట్టిన అమాయకత్వపు బాల్యమూ ....!
..

ఒడి దుడుకుల జీవిత౦ లో 
ఒంటికి రాసుకొన్న నైట్ క్వీన్ స్సెంట్ పరిమలాలతో
పడగ్గదిలో చేసిన సంతాన ప్రక్రియా ....
..

వేల మైళ్ళు నడిచిన నిజం 
బయలుదేరిన చోటే ఉండిపోయానన్న దిగులూ ... 

నీవో...నిరాశావాదివని గొంతు పెగిలేలా 
చుట్టు చేరి చెప్పే గొంతులూ ..
కాకుంటే
వంగి వంగి చేసిన సలాములు 
మోకరిల్లన క్షణాలు మినహా.
అంతకు మించి 
పెద్దగ మిగిల్చిన జ్ఞాపకలూ లేవు 

........

జీవిత౦ 
వాన నీటి లో 
విడిచిన కాగితపు పడవని 
తెలిసేలోగా 
టేబుల్ సొరుగు లో 
నిశ్చలమైన మొనాలిస మృత నవ్వుతో 
నిలిచి పోయిన పాత గడియార౦ !!

ప ద ౦
|| ప ద ౦ ||
సి.వి.సురేష్
ఒకానొక నిర్వేదపు అ౦చుల్లోనో
నమ్ముకొన్న నమ్మక౦ కసిగా కాటేసిన తరుణానో
ఎదురి౦చలేని నిస్సత్తువ నిలువునా ము౦చినప్పుడో
నా పదాల నిండా మ౦దుగు౦డు ని౦పాలనుంటు౦ది..
..
అగ్నిపర్వతాల నడుమ ఉదయంచే
మరో సూర్యుడి సెగనూ
కుత కుత ఉడుకుతున్న లావాను
పదాల నిండా వొ0పాలనుంటుంది
..

రగిలిన‌ భావాల్ని నేనే పలకరిస్తూ
నాపై అవి నడుచుకుంటూ వెళ్ళే వరకూ
అలా ఆశగా పదాలను రాస్తూనే ఉ౦డాలను౦ది!
ప్రశ్నిస్తూనే ఉండిపోదామను0టుంది...!
..

నియంతల గుండెలపై ..
నా పదాలు గురిపెట్టినప్పుడో
పదాలు రాసే చేయి కాలుస్తూనే రాస్తుంటుంది..!
..
ఒక్కో పద౦
ఒక్కో దేహాన్ని విచ్చుకుంటూ
ఇంకో దేహంలోకి చొచ్చుకుంటూ
విఘడియల కాలచక్రాన్నివెనక్కు తిప్పాలను౦టు౦ది!
..

కొన్ని క్షణాలు నన్ను ఆశక్తుణ్ణి చేసినప్పుడు..
నా చేతి వ్రేళ్ళను వెనక్కు విరిచినా..
అసహనంతో నన్ను దిగంబరుణ్ణి చేసినా
నా పదం నన్నొ జీవనది లా ప్రవహింపచేస్తుంది..!
..
ఒకసారి
ఒక్కో అలోచనా నరుక్కుంటు౦ది..
మళ్ళీ పదాలతో అదే అతికించుకొంటో౦ది
గు౦డెలోతుల్లో ఉద్భవి౦చే పదాలు
చాలా సార్లు ప్రసవవేదనలు పడుతూ
నాలో ఖాళీలను పూరిస్తూ పూరిస్తూ
రాస్తూ చెరిపేస్తూ
ద్వంసించుకుంటూ నిర్మించుకుంటూ ఉ౦టు౦టాయి
..

నాకు బాగా గుర్తే ఒక్కో పద౦
నా పాదముద్రల్నే కబళించుకుంటూ
నన్నొక అపరిచుతున్ని చేసి
నా పదాలే సందిస్తున్న‌ ప్రశ్నల్లా నిఠారుగానిలుచు౦టాయ్!
..

అయునా...సరే!
ఓ సజీవ చిత్రాన్నో
ఓ స౦క్లిష్టతనో
ఓ భీభత్సాన్నో
ఓ అనుభూతినో
నాలోని అంతః బహిర్ అనుభూతుల్నో
ఒక హృదయ స్పందననో
నా కలం పురుడుపోస్తూనే ఉంటుంది
..

పురుడుపోసుకొన్న ప్రతీసారీ
బ్రహ్మాండమైన శూన్యం నా మనసు నిండా! ! ! 

నా స్వప్నం

 || నా స్వప్నం || 

సి.వి.సురేష్
..
నా స్వప్నం 
నా ముందే సుళ్ళు సుళ్ళుగా తిరిగి ఎగిరి పోతాది ..
నల్లమల అడవి అంచుల మీదనో...
నాగేటి సాలల్లోనో ఇగిరి పోతాది. 
..
నా స్వప్నం ..
ఓ నిషిద్ధ కావ్యమవుతాది.
నా కల..
మేనిఫెస్టోల్లో అందంగా రాయబడతాది...
ఒక వీరుడి 
మరణవాంగ్మూలపు లేఖ లో అక్షరమవుతాది 
నా స్వప్నం 
ఓ వేకువజామున 
అడవిలో తూటాలకు బలి అవుతాది..
ఓ పూరి గుడిసె లో 
ఆకలి చావు అవుతుంది
సర్కారు హత్య అవుతుంది 
పెను శోకమవుతుంది!
...

విరిగిన ఆకలి ముక్కలను పేర్చుకుంటుంది.
నల్లరేగడి నేలలో నోట నురగవుతుంది.
వరిమడిలో బోరున విలపిస్తుంది.
నా స్వప్నం 
చితికి చిద్రమైన పల్లెల్లో 
కృష్ణమ్మ కన్నీళ్ళల్లో .
ఎర్రరేగడి నేలల్లో .... శోక తప్త .
..
నా కల...
చితికిన బ్రతుకుల్లో...
నిదుర లేని రాత్రుల్లో 
అలుపెరగని నా కళ్ళల్లో...
మళ్ళీ రేపటి రాత్రికై ఎదురు చూస్తాది.....!.

బైరాగి గీతం || బైరాగి గీతం ||
సి.వి. సురేష్
.
మృత్యువు కు జన్మకూ మధ్య
నలగని కాల౦ లో
ప్రత్యక్షపరోక్ష దుఃఖాలను తవ్వేస్తూ
రెండే రెండు జ్ఞాపకాల అలజడి....!
....
పారే నదిపై
ఇంకిన ప్రవాహాలను ము౦చెత్తే..
వ్యధల వెతల్లోని
భిన్నమైన నిశ్సబ్ద నివాళులు!
కరిగిపోయే రాతిరి అంచున
సజీవంగా వ్రేలాడే కొన్ని దుఖాలు
.....
చెప్పా పెట్టక వెళ్ళిపోయే
చిట్టచివరి శ్వాసల చుట్టూ
వ్రేలాడే మమతల జిగురు పాకాలు
ఎప్పటికీ.....!


అంతః ప్రయాణం


..
 || అంతః ప్రయాణం ||
..సి.వి.సురేష్
ఒక సందర్భంలో నేనో రాయిని భూమిలో పాతాను
దానిపైన నే సాధించిన‌ ఘనత రాశాను
నా కీర్తి గురించి ఆ రాయిమీద మొత్తం రాసేసాను.
అంతటితో ఆగలేదు...
ఇంకా ఇలా రాశాను
వయసుడిగే కొద్దీ కీర్తి కాంక్ష నన్ను మింగేసిందని.
పాతిన రాయికి ఆనవాలుగా నా 'దిగులు'ను అక్కడ‌ వేలాడదీశాను
2
ఇంకో సందర్బంలో ఓ చెట్టును నాటాను
చాలా కాలం బ్రతికేలా దృడంగా నాటాను
దానికి ఊడల్ని అతికించాను
ఆ చెట్టు తొర్రలో నా సంపద న‍ంతా దాచాను
అక్కడా ఇంకా ఇలా రాశాను
మనిషిని శాసించే ఎలిమెంట్...
మానవాళిని కబళించేదిక్కడ ఉందని
ఆ సంపదనుంచిన తొర్రకు ఆనవాలుగా అక్కడ నా “అహాన్ని” వేలాడదీశాను
3
మరో సందర్భంలో ఓ భూగృహాన్ని కట్టించాను
కొన్ని యుగాలైనా చెక్కు చెదరకుండా ఉండేలా చేశాను
ఆ భూగృహం లో నా సహచరిని “మమ్మి” గా చేసి ఉంచాను
దాన్నిండా ఆమెకు ఇష్టమైన వన్నీ ఉంచాను
వాటి గోడలపై ఇలా రాశాను
'నా' అనే అస్థిత్వం ఇక్కడి నుండే ప్రారంభమవుతుందని..
ఆ భూగృహానికి ఆనవాలుగా అక్కడ నా “ఆనందాన్ని” వేలాడదీశాను
4
పై మూడు సందర్భాలలో
నేను మరణిస్తూనే వచ్చాను
ఒక్కో మరణం నాలో ఒక్కో మార్పును తెచ్చింది
ఇప్పుడు నా దేహంలో
ఏ ఆనవాళ్ళు లేవు
ఎలాంటి భావావేశాలు లేవు
భావోద్వేగాలు లేవు
నన్నో స్థిత ప్ర‌జ్ఞుడని పిలుస్తున్నారు...

|| బంధీ ||
                                                   || బంధీ ||
             సి.వి.సురేష్
చిరిగిన నడిరేయి నుండి
చీకటి ధారగా కారుతూ నదిని నింపుతున్న శబ్దం...
ఎక్కడో ఏకాంతం లో ఉన్నా..
నా కనుల జారిన కన్నీటి బిందువు చెవుల్లోకి చేరింది
నిజమే కదా...ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కాయో!
...
...
కాలం చేతికి చిక్కిన నీవో నేనో..
నిశ్శబ్ద నడిరేయి ఎవరికీ వినిపించకుండ వేసిన గావుకేక
రాలిన క్షణాలను అక్కడికక్కడే లెక్కబెడుతూ
కుర్చోవాల్సిందే..
నమ్ముతావా ...! ఇప్పటికైనా ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కయో..?
..
..
ఇప్పుడిక నాకేమి మిగిలిందని..
నేర్రలు చీలిన నేలపై వృధాగా కొన్ని బాష్పాలను విడవడం మినహా..
ఆ నెల నుండి పోడుచుకొచ్చే
నా పురా పురా పూర్వీకుల జాలి ముఖాలు తప్ప..
నేనెప్పుడో చెప్పను కదా...
ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కినాయని....!!
....
....
సశేషం :
జినలజికల్ వృక్షాల ఊడలు
కింది నుండి పైకి ఊర్ధ్వ దిశగా మొలవడం....
ఎక్కడో బయల్పడిన ఫాస్సిల్స్ లో ఆనవాళ్ళను బట్టి
మనిషిగా మసలిన ఒక ప్రాచీన చీకటి
గుర్తు పట్టాల్సి వస్తుందని ....
ఇప్పుడైనా నమ్ము.....
ఆ నదీ తీరం ఎప్పటికి చెర వీడని బందీనే!!!.
*     *    *నా తెలుగు కవిత "బంధీ" పై అద్భుతమైన విశ్లేషణ రాసిన రాజేశ్వరి రామాయణం గారికి నా హృదయపూర్వక అభినందనలు.. ధన్యవాదాలు..!
I am very happy to see her analysis on my poem...!!
..
కవితా విశ్లేషణ.
కవిత్వం మనిషి యొక్క వూహల్లో పురుడుపోసుకున్న భావాల అక్షర మాలిక.
ఇది భిన్న ప్రత్రికలు,సాదృశ్యాలు కలుపుకొని
అల్ప పదాల్లో అనంత సారాన్ని ఒంపుకుంటుంది. ప్రతిభావంతులైన కవులు తమ ఆలోచనల్ని వ్యక్తం చేయడంలో కనబరిచే నిపుణత పాఠకుల్ని వేగంగా చదివించడమే కాదు సాంతం ఆలోచనల్లో ముంచివేస్తుంది.
అలాంటి ఓ కవితనే CV. సురేష్ గారు రాసిన "బందీ". మొన్న ఎప్పుడో చదివా . వెంటాడుతున్న భావాల సారాన్ని ఇలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా..
అజంతా గారు నేను శోధనా నాళికలలో,అర్థ సత్యాలలో జీవిస్తున్నాను.భ్రమ,విభ్రమాలలో బ్రతుకుతున్నాను.. భయంకరమైన వాస్తవం ఒకవైపు, కాలావధులకు అతీతంగా కలలపై పరిభ్రమిస్తున్న నైరూప్య ప్రపంచంలో నా అన్వేషణ ప్రారంభమవుతుంది...
అని తన స్వప్నలిపి కి ప్రారంభ వాక్యాల్లో ప్రస్తావించారు..
మనిషి లో మొదలైన అన్వేషణ భిన్న పార్శ్వాలను తాకుతూ ఒక్కోసారి నైరాశ్యంలో అతన్ని ముంచివేస్తుంది.
ఐనంతమాత్రాన అంతా నైరాస్యత ఉంటుందనేది జీవన సారం కాదు ..కానీ ఒక మనసు ఆలోకిక శాంతిని సంతరించుకుంటే మరింత తత్వాన్వేషణకు పునాది కాగలదనిపిస్తుంది..
సురేష్ గారి రచనలు గమనిస్తే తేలిగ్గా చదిివించే సరళమైన పద అల్లికతో పాటుగా నిగూఢ తాత్వికత కనిపిస్తుంది..ప్రేమ ప్రధానంగా సాగుతున్న గులాబీల సిరీస్ లోకూడా ఇదే గమనించవచ్చు..ఇప్పటి కవిత" బందీ "లో నా యోచన పరిధికి అందిన సారాన్ని స్టాంజాల వారీగా ఇలా రాసుకున్నాను.
1 స్టాంజా...
మనిషి ఏకాంతం లో కన్నీళ్లు కారుస్తూ తన యోచనలో గదిలో బందీగా...ఆ కన్నీళ్లు కింద పడుతుంటే... చీకటి ధారగా జారీ నదిలో కలిసే శబ్దం తో ప్రతీక..
2...స్టాంజా..
ఎన్ని ప్రయత్నాలు చేసినా..నీ జీవితానికి కాలం పరిష్కారం తప్ప ఇంకోటి కాదు.ఎవరూ చేయలేరు అని..చెప్పడం
3 స్టాంజా...
కంప్లీట్ desperation .. జీవితం లో ఇక మిగిలిందీ ఏమి లేదు..ఇక సాదించేది ఏమి లేదు అని...చెప్పడం..
నీవు కన్నీళ్లు కారిస్తే...గతించిన నీ పూర్వీకులకు స్పందన ఉంటుందేమో తప్ప ఇంకొకరికి ఎవ్వరికీ ఉండదు..
4.స్టాంజా..
సంతాన వృద్ధి తో వంశ వృక్షము (జానాలోజికల్ tree ) ని పెంచుకోవడం తప్ప. .... మనిషి తనం ను నీవు పుట్టించలేవు..ఆ అవకాశం ఉండదు..మనిషి తనాన్ని ఎక్కడో తవ్వకాల్లో శిలాజాల్లో ఇలా మనిషి ఉండేవాడిని.. చెప్పుకోవాలి తప్ప...ఇంకోటి ఉండదు..
ఇది సగటుమనిషి సంవేదన...ఒక కంప్లీట్ desperate situation..No body can change..అనే వ్యధ ఇలా బందీ కవిత గా అక్షర రూపాన్ని దాల్చుకుంది.
మనిషితనం అనేది ఇక వాస్తవ ప్రపంచంలో కనిపించదు..శిలాజాల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది...అలాంటి సమాజం లో మనిషి ఎప్పుడూ బంధీనే అనే నైరాశ్యం ఈ కవితకు ఆత్మగా వుందనిపిస్తోంది..
సమకాలీన సమాజంలో ఉన్న పరిణామాలు ఇలానే వున్నా మనిషిని నడిపించే ఓ అలౌకిక శక్తిని అదే "మనిషి పట్ల మరో మనిషికున్న సహానుభూతి "అనే బంధాన్ని ఇంకా విశ్వసించే ఎందరో సామాజిక జీవుల్లా ఆశని సాంతం నింపుకుందాం అని ; పరస్పర విశ్వాసాన్ని సంరక్షించుకొనే ప్రయత్నం కొనసాగించుదామని ఆశిస్తూ....
నా తొలి ప్రయత్నం లో దోషాల్ని సవరించే సహృదయత ని స్వాగతిస్తూ...
రాజేశ్వరి. రామాయణం.
18.06.18.

..

క్షితిజ రేఖ ॥ క్షితిజ రేఖ ॥

                           సి.వి.సురేష్

కొన్నిక్షణాలైనా
బ్రతకాలనుకోవడం సహజమై౦ది ..!

బ్రతికే తీరాలన్న బలమైన కోరిక
గది మూలన గుట్టలుగా పడిన
సూసైడ్ నోట్ల పరిహాసాల్లో...
చీకటిపాటలా వె౦టాడుతూనే ఉంటుంది.
..

సమూహాల బ్రతుకుల్లో...
మనసును 
పచ్చికబయళ్ళపై నడిపి౦చాలన్న గాఢమైన ఆశ!
రెక్కలాడిస్తూ కళ్లెదుటే వాలి పోతు౦ది. 
హిపోక్రసి !!!
...

కోరిన జీవిత౦ 
మెనుకార్డులాగా ఎదుటపడాలన్న తపన ...
వీలునామాల్లో గొలుసురాతల బ౦ధాలు
గజి బిజి గా స౦దడి చేస్తూ..... 

2
అనుభవాల కిటికీ ఆవల 
విడతలుగా వెలుగురేఖల అసహన కదలిక
విడతకూ విడతకూ మధ్య 
మరణవా౦గ్మూలాలు దోషిగా నిలబెడతాయ్...!!

3.
విస్తృత౦గా పుట్టుకొచ్చే ఆలోచనలకూ
సమాజపు ఇజాలకూ...
క్షితిజరేఖొకటి ఎప్పటికీ అడ్డ౦కే... !!!

శిథిల స్వర్గం

 || శిథిల స్వర్గం ||
సి.వి. సురేష్

నిజమే... ! 

ఒక అపరిచిత దుఖాన్నిప్పుడు 

మనం స్వీకరించక తప్పదు.!

..
పొగమంచు లో కనుచూపు మేరా

చేతులు కలిపి సాగి ....

అమా౦త౦గా

పాయలు పాయలు గా చీలి పోతావు!

ఎక్కడికని వెళ్తావ్?

నామొహమ్మీద ఒక మృత ప్రేమని అతికించి?

......

నీవన్నట్లు....

మరేవీ జ్ఞాపకం పెట్టుకోలేక పోతున్నా

ఇరువురి హసితాల్లో

పదే పదే గుర్తుకొచ్చి

నిశ్సబ్దంగా వినిపించే ఒక విషాద రాగం మినహా...!

2

ముక్కలు ముక్కలుగా పగిలిన దేదీ

ఇమడదని నీకూ తెలుసు.

అయినా....సరే...

చీకటి పొరల్లో కారునలుపులా

స్తిమితమవుదామనుకొంటున్నావు!

...
ఆ రెండు తీరాల్లో

జీవనదిలా ఉబికే కన్నీళ్ళని

ఎక్కడని కలిపేయమంటావు?

ఏ ఒయసిస్సుల్లో నిక్షిప్తం చేస్తామో.... చెప్పు?

మన ఇద్దరి అసంపూర్ణ ఆశ్రు వర్షాల్ని?

3
అవును...!

ఇప్పుడు మన ఇరువురమూ

శిధిల ఏకాంత శిల్పాలమే.

ఆ శిథిల స్వర్గం లో....!

గాయపు స్మృతులు|| గాయపు స్మృతులు ||
సి. వి. సురేష్

1....
పురా స్మృతులలో ... 
కొద్ధి కొద్దిగా మృత్యువు ను రుచి చూపే 
జ్ఞాపకపు గాయాల్లో
అనంత ప్రేమదో నిశ్శబ్ద ఆకాంక్ష !!
....
సముద్రపు ఒడ్డున మౌనంగా వర్షించే
తీరపు కన్నీళ్ళలో ...
ముసురుకొన్న దు:ఖాల్లో
దీర్ఘ వసంతానిదో సౌశీల్య ఆకాంక్ష !
...
ఇరు దృవాల మాటున
జీవితాస్తమయాల్లో ...
నల్లని రాతిరి గుబుళ్ళల్లో
రేపటి ఉదయనిదో విభ్రమ ఆకాంక్ష!!
....

2
రక్త బిందువు చుట్టూ అల్లుకొనే
తాత్వికత ...!
దుఃఖ భార వినమిత శరీరాలపైన
ఆకాంక్షల అంతు ....!
గాయపడకుండా సాధ్యమ౦టావా?

పవిత్ర మైన ఆ మూడు రోజులు...!
||పవిత్ర మైన ఆ మూడు రోజులు...!||
||The Sacred Three Days...||
..సి.వి. సురేష్

కొత్తదీకాదు ....ఆచ్చాదితమూ కాదు.
ఒకానొక నిశ్శబ్దం నుండి ‘గుట్టు’ 
ఆక్షేపిత కలాల మధ్య ధ్వనిస్తూ లిఖిస్తోంది.
సంస్కార నిషేద౦
కొన్ని గోడల మాటున....
దాచిన మూడు రోజులు బహిరంగ వేదికపై..
ఇప్పుడు నీలి రక్తాన్ని స్రవిస్తు౦ది...!
..
2
..
ఏది రహస్యం.... ?
రాతిరి చీకటి చిక్కగా కోసే చివురాకుల బాధలు
ప్రతి గుమ్మానికి బహిరంగంగా వ్రేలాడదీయండి ...
సగం తెగిన దేహాలేవో దండెం పైన
ఆరవేసే తెగువను విస్పోటపరచండి.
అవన్నీ ఇప్పుడు , అసంబద్ద కవితల
సమాహారమవ్వనూ వచ్చు.
దివ్య ద్వారాల అవని రహస్య మేధో
కవనాల అపరూప వస్తువైంది..
ఆధునిక కవితల్లో వగస్తున్న
ఆ గుట్టు baton లా అందుకొని అలరిస్తోంది...
అపరూప రహస్య౦ పేపర్లో
చుట్టుకొని వెళుతూ జియస్టి తో బహిరంగమైంది.
..
3
..
ఏది పవిత్రం ...?
నిస్సిగ్గుల చర్చలో స్రవిస్తున్న
మూడు రోజుల కష్ట౦...
పవిత్రమైన అమ్మతనానికి తొలి గుమ్మం..
కాదంటావా?