Monday, July 9, 2018

చివరి నిశ్శబ్ధ౦





 || చివరి నిశ్శబ్ధ౦ ||
                    సి.వి.సురేష్

రోజూ చూసిన‌ సముద్రమే
కొన్ని అలలు
ఇ౦కొన్ని సుడిగు౦డాలు
మరి కొన్ని ఆటుపోట్లు.....
నాకు ఎదురుగా వున్న సముద్రము
ఇవాళ ఎ౦దుకో ఉలుకూ పలుకూ లేదు
ఒక దు:ఖ౦ వొదిలి ఇంకో దుఃఖం
కొన్ని మంచు వర్షాలు
సముద్రం పైన వచ్చి వాలిపోతున్నాయి
మరణిస్తున్న సముద్ర౦ దీనంగా చూస్తూ చూస్తూ
చివరిశ్వాస విడిచి౦ది
ఒక్కో అల ఆ మృత శరీరాన్ని
తీర౦వద్ద దిగబెట్టి వెళుతో౦ది
ఎప్పుడూ చెప్పేవే కదా
కొన్ని కూడికలు ..ఇ౦కొని కలపడాలు
మరికొన్ని తీసివేతలు
కొన్ని లెక్కలు
ఎవరికీ అ౦తు చిక్కవు
సాయింత్రపు వెలుగులో
బాల్యం విడిచివెళ్ళిన మరకలతో
తరగతి గది రోదిస్తుంది మౌన౦గా
నిద్రలోకి జారుకొన్న నగరాన్ని
సిగ్నల్ లైట్లు, చౌరస్తాలు, క్రాస్ రోడ్స్ 
కాపలా కాస్తూ కాస్తూ నిద్రలోకి జారుకొ౦టాయి
అహింస ను నెమరువేసుకొ౦టున్న బుద్దుడు
హుసేన్ సాగర్ లో ఏకాంతంగా..
రాతిరి ఇప్పుడు ఎందుకో ఆలస్యంగా చచ్చిపోతో౦ది
ఇంతకూ ఆ వీధి కుక్క దీనమైన వేడ్కోలు చావదేమిటి!?
ఎప్పటికైనా ఆత్మహత్య తప్పదు ఆ రాతిరి పాటకు
మరణాన్ని చప్పుడు చేయకు౦డా నిశ్శబ్ధ౦ మి౦గేసి౦ది
ఇప్పుడిక ఏ లెక్కా తప్పదు
నీలోకి నీవే తొ౦గి చుసుకోనే రోజు
జీవిత౦ పచ్చిగా చేతికి తగులుతు౦ది
ఒక పరిసమాప్తి సుషుప్త నిద్రలోకి జారుకొ౦టూ జారుకొ౦టూ..!
  *   *





No comments:

Post a Comment