Monday, July 9, 2018

ఒక రాతిరి..



// ఒక రాతిరి...//
సి.వి.సురేష్
ఎక్కడికని ఈ రాతిరి నిను తీసుకెళ్తుంది..?
కొన్ని కలల పచ్చితనాన్ని 
ఇంకొన్ని ఆరాటాలనీ..
గదుల్ను౦డి గదుల్లోకి మారుస్తూ...
స్వర్గ స్రావం లోకి మోసుకెళ్తుందా..?
.
జ్వలిస్తున్న నేత్రాలలో కటిక చీకట్లు..
కాంక్షిస్తున్న ముద్ర ల్లో ఖాళీ గదులు
మూయని రెప్పల గుండా.
దొర్లని క్షణాలు...
రెప్ప మూసినా కదలని ఆలోచనల కదంబాలతో ...!
ఎక్కడికని ఈ రాతిరి నిను చేరుస్తు౦ది.?
.
ఆలోచనల పొరలను గుచ్చి బాదించే
నక్షత్ర కాంతుల ముల్లులు ...
వెన్నెల మంటలో ఎర్రగా కాలే
ఆ దేహపు కమురు వాసనలు....
ఎంత సేపని ఈ రాతిరి నిను బాదిస్తుంది?
.
నీడల్లా పరచుకొన్న శబ్ద ప్రవాహం...
నిశ్శబ్ద నిశీధి నుండి కొమ్మల మీదుగా
ఒక్కో చీకటి బొట్టూ....
దాటు కొచ్చిన రాతిరి
నిన్నేతీరం వైపుకు సాగనంపుతుంది!?
.
2
లోలోపలనే
పారి, ఘనీభవించిన సముద్రాలు
చుట్టూ..
చేతులు జాపిన మరణ మాయ
వెయ్యిన్నూట రెక్కలతో స్వప్న తీరాలను చేర్చే..
ఈ కటిక రాతిరి...
నిన్నిలా ఆవహించక పోతుందా?
.
3.
కరిగే కాలం నుండి కారే చీకటి..
నిన్నో స్థితి నుండి అస్తితి కి జారవిడిచి
రహస్య బాష లను గొంతు స్నాతం లోకి ది౦పుతూ..
పాడే రాతిరిపాట నిన్నే లోకం లోకి చేరుస్తో౦ది?
.
4
ఊపిరి ఆగాక సాగిల పడే
కరుణ,...
కడదాకా..... కదిలి ...
నిన్నో చిక్కటి రాతిరి లో కప్పెట్టేయదా?

No comments:

Post a Comment