Monday, July 9, 2018

అంతః ప్రయాణం


..




 || అంతః ప్రయాణం ||
..సి.వి.సురేష్
ఒక సందర్భంలో నేనో రాయిని భూమిలో పాతాను
దానిపైన నే సాధించిన‌ ఘనత రాశాను
నా కీర్తి గురించి ఆ రాయిమీద మొత్తం రాసేసాను.
అంతటితో ఆగలేదు...
ఇంకా ఇలా రాశాను
వయసుడిగే కొద్దీ కీర్తి కాంక్ష నన్ను మింగేసిందని.
పాతిన రాయికి ఆనవాలుగా నా 'దిగులు'ను అక్కడ‌ వేలాడదీశాను
2
ఇంకో సందర్బంలో ఓ చెట్టును నాటాను
చాలా కాలం బ్రతికేలా దృడంగా నాటాను
దానికి ఊడల్ని అతికించాను
ఆ చెట్టు తొర్రలో నా సంపద న‍ంతా దాచాను
అక్కడా ఇంకా ఇలా రాశాను
మనిషిని శాసించే ఎలిమెంట్...
మానవాళిని కబళించేదిక్కడ ఉందని
ఆ సంపదనుంచిన తొర్రకు ఆనవాలుగా అక్కడ నా “అహాన్ని” వేలాడదీశాను
3
మరో సందర్భంలో ఓ భూగృహాన్ని కట్టించాను
కొన్ని యుగాలైనా చెక్కు చెదరకుండా ఉండేలా చేశాను
ఆ భూగృహం లో నా సహచరిని “మమ్మి” గా చేసి ఉంచాను
దాన్నిండా ఆమెకు ఇష్టమైన వన్నీ ఉంచాను
వాటి గోడలపై ఇలా రాశాను
'నా' అనే అస్థిత్వం ఇక్కడి నుండే ప్రారంభమవుతుందని..
ఆ భూగృహానికి ఆనవాలుగా అక్కడ నా “ఆనందాన్ని” వేలాడదీశాను
4
పై మూడు సందర్భాలలో
నేను మరణిస్తూనే వచ్చాను
ఒక్కో మరణం నాలో ఒక్కో మార్పును తెచ్చింది
ఇప్పుడు నా దేహంలో
ఏ ఆనవాళ్ళు లేవు
ఎలాంటి భావావేశాలు లేవు
భావోద్వేగాలు లేవు
నన్నో స్థిత ప్ర‌జ్ఞుడని పిలుస్తున్నారు...

No comments:

Post a Comment