Monday, July 9, 2018

|| బంధీ ||
                                                   || బంధీ ||
             సి.వి.సురేష్
చిరిగిన నడిరేయి నుండి
చీకటి ధారగా కారుతూ నదిని నింపుతున్న శబ్దం...
ఎక్కడో ఏకాంతం లో ఉన్నా..
నా కనుల జారిన కన్నీటి బిందువు చెవుల్లోకి చేరింది
నిజమే కదా...ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కాయో!
...
...
కాలం చేతికి చిక్కిన నీవో నేనో..
నిశ్శబ్ద నడిరేయి ఎవరికీ వినిపించకుండ వేసిన గావుకేక
రాలిన క్షణాలను అక్కడికక్కడే లెక్కబెడుతూ
కుర్చోవాల్సిందే..
నమ్ముతావా ...! ఇప్పటికైనా ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కయో..?
..
..
ఇప్పుడిక నాకేమి మిగిలిందని..
నేర్రలు చీలిన నేలపై వృధాగా కొన్ని బాష్పాలను విడవడం మినహా..
ఆ నెల నుండి పోడుచుకొచ్చే
నా పురా పురా పూర్వీకుల జాలి ముఖాలు తప్ప..
నేనెప్పుడో చెప్పను కదా...
ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కినాయని....!!
....
....
సశేషం :
జినలజికల్ వృక్షాల ఊడలు
కింది నుండి పైకి ఊర్ధ్వ దిశగా మొలవడం....
ఎక్కడో బయల్పడిన ఫాస్సిల్స్ లో ఆనవాళ్ళను బట్టి
మనిషిగా మసలిన ఒక ప్రాచీన చీకటి
గుర్తు పట్టాల్సి వస్తుందని ....
ఇప్పుడైనా నమ్ము.....
ఆ నదీ తీరం ఎప్పటికి చెర వీడని బందీనే!!!.
*     *    *నా తెలుగు కవిత "బంధీ" పై అద్భుతమైన విశ్లేషణ రాసిన రాజేశ్వరి రామాయణం గారికి నా హృదయపూర్వక అభినందనలు.. ధన్యవాదాలు..!
I am very happy to see her analysis on my poem...!!
..
కవితా విశ్లేషణ.
కవిత్వం మనిషి యొక్క వూహల్లో పురుడుపోసుకున్న భావాల అక్షర మాలిక.
ఇది భిన్న ప్రత్రికలు,సాదృశ్యాలు కలుపుకొని
అల్ప పదాల్లో అనంత సారాన్ని ఒంపుకుంటుంది. ప్రతిభావంతులైన కవులు తమ ఆలోచనల్ని వ్యక్తం చేయడంలో కనబరిచే నిపుణత పాఠకుల్ని వేగంగా చదివించడమే కాదు సాంతం ఆలోచనల్లో ముంచివేస్తుంది.
అలాంటి ఓ కవితనే CV. సురేష్ గారు రాసిన "బందీ". మొన్న ఎప్పుడో చదివా . వెంటాడుతున్న భావాల సారాన్ని ఇలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా..
అజంతా గారు నేను శోధనా నాళికలలో,అర్థ సత్యాలలో జీవిస్తున్నాను.భ్రమ,విభ్రమాలలో బ్రతుకుతున్నాను.. భయంకరమైన వాస్తవం ఒకవైపు, కాలావధులకు అతీతంగా కలలపై పరిభ్రమిస్తున్న నైరూప్య ప్రపంచంలో నా అన్వేషణ ప్రారంభమవుతుంది...
అని తన స్వప్నలిపి కి ప్రారంభ వాక్యాల్లో ప్రస్తావించారు..
మనిషి లో మొదలైన అన్వేషణ భిన్న పార్శ్వాలను తాకుతూ ఒక్కోసారి నైరాశ్యంలో అతన్ని ముంచివేస్తుంది.
ఐనంతమాత్రాన అంతా నైరాస్యత ఉంటుందనేది జీవన సారం కాదు ..కానీ ఒక మనసు ఆలోకిక శాంతిని సంతరించుకుంటే మరింత తత్వాన్వేషణకు పునాది కాగలదనిపిస్తుంది..
సురేష్ గారి రచనలు గమనిస్తే తేలిగ్గా చదిివించే సరళమైన పద అల్లికతో పాటుగా నిగూఢ తాత్వికత కనిపిస్తుంది..ప్రేమ ప్రధానంగా సాగుతున్న గులాబీల సిరీస్ లోకూడా ఇదే గమనించవచ్చు..ఇప్పటి కవిత" బందీ "లో నా యోచన పరిధికి అందిన సారాన్ని స్టాంజాల వారీగా ఇలా రాసుకున్నాను.
1 స్టాంజా...
మనిషి ఏకాంతం లో కన్నీళ్లు కారుస్తూ తన యోచనలో గదిలో బందీగా...ఆ కన్నీళ్లు కింద పడుతుంటే... చీకటి ధారగా జారీ నదిలో కలిసే శబ్దం తో ప్రతీక..
2...స్టాంజా..
ఎన్ని ప్రయత్నాలు చేసినా..నీ జీవితానికి కాలం పరిష్కారం తప్ప ఇంకోటి కాదు.ఎవరూ చేయలేరు అని..చెప్పడం
3 స్టాంజా...
కంప్లీట్ desperation .. జీవితం లో ఇక మిగిలిందీ ఏమి లేదు..ఇక సాదించేది ఏమి లేదు అని...చెప్పడం..
నీవు కన్నీళ్లు కారిస్తే...గతించిన నీ పూర్వీకులకు స్పందన ఉంటుందేమో తప్ప ఇంకొకరికి ఎవ్వరికీ ఉండదు..
4.స్టాంజా..
సంతాన వృద్ధి తో వంశ వృక్షము (జానాలోజికల్ tree ) ని పెంచుకోవడం తప్ప. .... మనిషి తనం ను నీవు పుట్టించలేవు..ఆ అవకాశం ఉండదు..మనిషి తనాన్ని ఎక్కడో తవ్వకాల్లో శిలాజాల్లో ఇలా మనిషి ఉండేవాడిని.. చెప్పుకోవాలి తప్ప...ఇంకోటి ఉండదు..
ఇది సగటుమనిషి సంవేదన...ఒక కంప్లీట్ desperate situation..No body can change..అనే వ్యధ ఇలా బందీ కవిత గా అక్షర రూపాన్ని దాల్చుకుంది.
మనిషితనం అనేది ఇక వాస్తవ ప్రపంచంలో కనిపించదు..శిలాజాల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది...అలాంటి సమాజం లో మనిషి ఎప్పుడూ బంధీనే అనే నైరాశ్యం ఈ కవితకు ఆత్మగా వుందనిపిస్తోంది..
సమకాలీన సమాజంలో ఉన్న పరిణామాలు ఇలానే వున్నా మనిషిని నడిపించే ఓ అలౌకిక శక్తిని అదే "మనిషి పట్ల మరో మనిషికున్న సహానుభూతి "అనే బంధాన్ని ఇంకా విశ్వసించే ఎందరో సామాజిక జీవుల్లా ఆశని సాంతం నింపుకుందాం అని ; పరస్పర విశ్వాసాన్ని సంరక్షించుకొనే ప్రయత్నం కొనసాగించుదామని ఆశిస్తూ....
నా తొలి ప్రయత్నం లో దోషాల్ని సవరించే సహృదయత ని స్వాగతిస్తూ...
రాజేశ్వరి. రామాయణం.
18.06.18.

..

No comments:

Post a Comment