Monday, July 9, 2018

“గాయపడిన గుండె” రాసిన కవిత్వం సురేష్ ది

“గాయపడిన గుండె” రాసిన కవిత్వం సురేష్ ది
~
రాజారామ్.
“ ఒక మధ్యాహ్న వేళ
కొన్ని పుస్తకాలు.. మరికొన్ని కవితా స౦కలనాల్ని
భుజాన వేలాడే స౦చిలో వేసుకొని
కవిత రాయాలని బయలు దేరాను
నీవెప్పుడైనా కవిత్వ౦ రాశావా? ఒక అదృశ్య రూప౦ ప్రశ్ని౦చి౦ది
దట్టమైన చీకటిని తరిమేస్తూ వొళ్లిరుచుకొనే ఉదయ౦లా...!
కిటికీలో౦చి శబ్ధ౦ చేయకు౦డా..
చొచ్చుకొచ్చే కా౦తి రేఖలా
ఏ క్షణానో గు౦డెను ఆకస్మాత్తుగా తట్టి లేపే కవిత్వాన్ని స్వాగతి౦చావా? అని ఆ రూప౦ మళ్ళీ అడిగి౦ది
మళ్ళీ కాసేపు మౌన౦ నాలో...!
వె౦టనే భుజాన స౦చిలో
సంకలనాలని...కవితల్ని పక్కన పెట్టాను.
మనసులో కాసి౦త తడి, మానవత్వాన్ని ని౦పడ౦ మొదలుపెట్టాను
వె౦టనే ఆ అదృశ్యరూప౦ కవితాకన్యగా మారి
ఆన౦ద౦తో పొ౦గిపోయి౦ది. ...నా ము౦దు సాక్షాత్కరి౦చి౦ది!!!”
ఒక్కొక్క కవికి వొక్కోరకంగా కవిత కన్యక సాక్షాత్కరిస్తుందేమో ?నవపేశలసుమగీతావరణంలో సుస్యందున మందున వినువీధుల్లో విహరించిన వేళల్లో తన నుడి గుడిగా కవిత సాక్షాత్కరించింది మహాకవి శ్రీశ్రీ గారికి. కవితా సాక్షాత్కారం వొక అపూర్వ అనుభవం. ఈ కవికి వొక మధ్యాహ్నపు వేళ దట్టమైన చీకటిని తరిమివేస్తూ వొళ్ళు విరుచుకొంటు వచ్చే ఉదయంలా,కిటికిలోంచి శబ్దం చేయకుండా చొచ్చుకొచ్చే కాంతి రేఖలా కవిత సాక్షాత్కరించింది. ఇట్లా కవిత్వాన్ని సాక్షాత్కరించుకున్న యువకవి ఎవరో కాదు సి.వి.సురేష్ గారు.
మనసులో కాసి౦త తడి, మానవత్వాన్ని ని౦పుకొన్న మిత్రుడు అవధానం సాంప్రదాయ కవిత్వం బాగా వేళ్ళునుకున్న ప్రొద్దూటూర్ లో ఆధునిక కవిత్వాన్ని అమితంగా ప్రేమిస్తూ.. రాస్తూ.. మంచి కవితల్ని ఆంగ్ల భాషలోకి అనుసృజన చేస్తూ.. పాశ్చాత్య కవుల సంగీత కవిత్వాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తున్నవాడు ఈ సురేష్. అద్భుతమైన కవిత్వ ప్రేమికుడు.అందమైన కవి ఈ సురేష్.
చిరిగిన నడిరేయి నుండి
చీకటి ధారగా కారుతూ నదిని నింపుతున్న శబ్దం...
ఎక్కడో ఏకాంతం లో ఉన్నా..
నా కనుల జారిన కన్నీటి బిందువు చెవుల్లోకి చేరింది
నిజమే కదా...ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కాయో!
నది నల్లగా కనిపిస్తుంది. అలా కనిపించడానికి కారణం చినిగిపోయిన నడిరేయి నుండి చీకటి ధారగా కారి నదిని నింపడమే. ఎంత గొప్ప ఊహ ఈ కవిది . చీకటికున్న ధర్మాన్ని ఈ కవి నదికి ఆపాదిస్తూ.. వొక ఉత్ప్రేక్షను ద్రాక్షాలా మార్చి మన మెదడు అందించాడు. భావగాఢత ,సాంద్ర వ్యక్తీకరణ కవిత్వానికి అవసరంగా కావాల్సిన మూలద్రవ్యాలు. ఆరెండు ఈ కవి కవిత్వంలో కనిపిస్తుంటాయి పుష్కలంగా వర్షంలో ఆకాశంలోని మెరుపుల్లోని ఉరుములా ఉరుముల్లోని మెరుపులా.ఆమెను వర్షంతో రూపు కట్టి ఇలా రాస్తాడు.
అలవాటైన వర్షమే..
నాలో నీవై కురిసే ఆ వర్షం తెలిసి౦దే కదా...
..
ఆ ఉదయానికి నీవందించిన నాలో
ఎందుకనో మైదానమంత దిగులువర్షం..
హఠాత్తుగా చీకటి పరచుకొన్న
జాములో నిర్మితమయ్యే నేను
రికామీ గాలి తుంపరలో భోరున వర్షిస్తుంటా

అతనిపై కురిసే వర్షం ఆమె. అతనిలో మైదానమంతా దిగులట. మైదానం విశాలమైంది కదా. దిగులు కూడా అతనిలో అలా వ్యాపించిందట. గాలి తుంపరలో భోరున కురిసే ఒక వైపుగా కురవదు. గాలి ఎటు వైపు వీస్తే అటువైపు తిరుగుతూవుంటుంది. అతని దుఃఖానికి ఒక కారణం కాదు అనేకం వున్నాయని చెప్పడానికి కవి “గాలి తుంపరలో భోరున వర్షిస్తూ” – అని అంటాడు. నదీ తీరాలు కొబ్బరాకుల మధ్య బందీలు గా చిక్కుకోవడం అంటే నదిలా హాయిగా స్వేఛ్ఛ గా ప్రవాహంలా సాగాల్సిన జీవితాన్ని దుఃఖం బందీ చేసిందట. కొబ్బరాకుల్ని దుఃఖానికి పోలికలుగా చేశాడు. కొబ్బరాకుల్ని చూస్తే వాటి అమరికలోని వైవిధ్యం లా దుంఖంలో కూడా వైవిధ్యం వుందని సూచించడమేమో.
ఆమెను తనను ఈ కవివర్ష శబ్ద వలయంలో ఉరుము మెరుపులతో పోల్చి ఆమె లేకుండా అతను అతను లేకుండా ఆమె లేదు అని ధ్వనిస్తాడు.అంతేకాదు ఒక కవి అన్నట్లు ‘ ఉరుము మెరుపు లేకపోతే అది ఆకాశమే కానట్లు’ ప్రేమికులమధ్య ఎడబాటు కలయికలు లేకపోతే అది ప్రేమే కాదేమో అన్న వొక స్పృహ ని ధ్వనించాడేమో ఈ కవి అని అనిపిస్తుంది.
“ప్రతీసారి,
ఆ వర్షశబ్ద వలయంలో...
నీవూ నేనూ కలిసే ధ్వనిస్తుంటాం.
ఉరుముల్లో దాగిన మెరుపులాగా
మెరుపులో శబ్ధించే ధ్వనిలాగా..
కురిసే ప్రత్యూష వర్షం నీలో నా”
ఈ పైన ఉదాహారించిన ఈ మూడు కవితలు కవి ఆత్మీయ భావనల్ని మీటినట్లువున్నాయి. అట్లా తన హృదయ రహఃస్తంత్రిని మీటి ఊహాబలంతో భావ శబలతతో కవిత్వం రాస్తున్న కవి సి.వి.సురేష్ గారు.ఎందరో ప్రసిద్ధ తెలుగు కవుల కవితల్ని ఆంగ్లంలోకి అనుసృజన చేస్తూ అనువాదంలో సృజనాత్మకతను కనబరుస్తున్న కవి ఇతను. గాయపడిన గుండె రాసిన కవిత్వంలా రాస్తున్న కవి ఇతను.
స్నిగ్ధత సరళత ఈ సురేష్ కవిత్వంలో కనిపించే లక్షణాలు. తను ఇదే కవిత్వం అనుకుండే దశలో రాసింది ఇది దీన్ని చూడండి.
“ఆమె ఇష్టపడినదే
అవనిపై అందం...
ఆమె శ్వాసిస్తేనే
ఆ సౌరభమూ,ఆ పరిమళము...!”
రాజు మెచ్చిందే రంభ.తన ప్రేయసీ ఇష్టపడిందే అందమట. ఆమె శ్వాసించిందే సౌరభం పరిమళమట. ఈ మాటల్లో స్నిగ్ధత సరళత మాత్రమే కాదు గాఢతకూడా వుంది.
గులాబీలు అంటే ఇష్టం లేనివాళ్ళెవరు ?కవులనుంచి కాంతల దాకా వాటిని ఇష్టపడుతారు. గులాబీలకింద ముళ్ళున్నా అవి గుచ్చుకుంటాయేమో అని భయమున్న ఆ గులాబీలపై ఆడవాళ్ళకీ ప్రేమ తగ్గనట్లు కవులకు వాటిపై ప్రీతి పెరుగుతూనేవుంటుందేమో. కొందరు గులాబీలను కవిత్వం చేస్తే గులాబీ రేకుల్లాంటి సౌకుమార్యతను పొదిగి ‘గులాబీలు’ అనే శీర్షికతో వరుస పద్యాలే రాశాడు ఈ సురేష్.
ఈ కవి తనను తన సహచరిని సమాంతరేఖలపై నిలబడి పాడుకొనే నిషిద్ధ పద్యాలు గా పోల్చుకున్న గులాబీ కవితలో ఇలా రాస్తాడు.
“ ఏమైతేనేం...
ప్రతిరాత్రి నా ఆత్మ... ఆ మోదుగువనం లో
నిన్నో పద్యంగా మార్చి రాగయుక్తమవ్వడం...
సిగ్మండ్ కూ తెలియని స్వప్నాల్ని నీకు సృష్టించివ్వడం. ...
మోనాలిసెరుగని మందహాసాల్ని నీ పెదాలపై పూయడం..షరా..!
వీటిలో ..నీకేవైనా కొత్తగా అనిపిస్తున్నాయా ? చెప్పు?.”
సిగ్మండ్ ఫ్రాయిడ్ సుప్రసిద్ధ మనఃశాస్త్రవేత్త .మొనాలిసా అద్భుతమైన పెయింటింగ్ .ఫ్రాయిడ్ కలల్ని విశ్లేషిస్తే మొనాలిసా పెదాలపై అదో కొత్త భావం స్ఫురించే వొక మందహాసం వున్న చిత్రం. సిగ్మండ్ ఫ్రాయిడ్ కే తెలియని కొత్త కలల్నిఆమె కోసం సృష్టిస్తానని, మొనాలిసా కు కూడా తెలియని మందహాసాల్ని ఆమె పెదవులపై పూయిస్తానని ఈ కవి అంటూ..పైన అన్నవి అన్నీ నీకేమైనా కొత్తగా అనిపిస్తున్నాయా అని అడుగుతాడు.ఇది కొసమెరుపు. ప్రేమికుల మాటల్లో ఏది పాతపడదు.ప్రతిదీ అది ఎన్నిసార్లు చెప్పినా చెప్పిన ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. అయినా “నీకేమైనా కొత్తగా అనిపిస్తున్నాయా “ -అని ఆమెను అతను అలా అడగడం అంటే.. అతని నుండి ఆమె లోకి ...ఆమె నుండి అతనిలోకి నదిలా పయనించే మాట్లాడుతున్న సుదీర్ఘ కవిత్వం కొనసాగుతున్నదని చెప్పడమే.
‘ వర్షపు చినుకు నను తాకిన
ప్రతి సందర్భం
నాకోసం నీవు విడిచే
కన్నీళ్లొ.. ఆనంద బాష్పాలో అనిపిస్తావమ్మా!!’
నింగి నుంచి నేలకు రాలుతున్న ప్రతి వాన చినుకు ఈ కవికి వాళ్ళమ్మ అతని కోసం రాలుస్తున్న కన్నీళ్ళో ఆనంద బాష్పాలో అని అనిపిస్తాయట. అమ్మను ఇట్లా బొమ్మ కట్టించిన కవి సురేష్. దోసిలి పట్టి ఒకవ్యధా గీతాన్నో ఒక అశృతర్పణాన్నో అమ్మ కోసం చేయొచ్చు ఎవరైనా. కానీ అమ్మ ప్రేమను జ్ఞాపకాలను తన హృదయపు గోడ మీద ఫ్రేమ్ చేసి ఎట్లా కట్టుకున్నాడో ఈ కింది కవితలో చూపెడతాడు.
‘ అంతాంతరనా ఓ చమురుదీపమై
అన్ని సాయింత్రాలను వెలిగిస్తూ
రాతిరికి జోలపాటయ్యేదమ్మే
...
కొన్ని నిశ్శబ్ధాలను మోసుకెళ్తూ
కడుపులో తొంగి చూసే
ఆ చూపులు
నా నిర్ధయ పశ్చాత్తాపంలో
కళ్ళు చెమర్చే ప్రతీ సందర్భం అమ్మదే!!
ఆమె అతను ఎదురుచూస్తున్నది సరిగ్గా ఇలాంటి రాత్రి కోసమేనట. అది ఎలాంటి రాత్రి అంటే..వారిద్దరి మనసులు కీట్స్ కవిత్వం వాలిన రాత్రి , ఫ్లాబో నెరూడా లవ్ సానెట్స్ వాళ్ళిద్దరి మధ్య కరుగుతున్న కాలపు ఘడియల్ని లెక్కపెట్టిన రాత్రి. అలాంటి రాత్రిని ఎట్లా వుంటుందో సురేష్ మాటల్లో ఇలా వుంది.
ఆ వెన్నెల రాత్రి లో
ఎన్ని వసంతాలను ఆ దీపశిఖల మీదుగా
వాళ్ళిద్దరూ నడిపించుకొంటూ వెళ్ళారో..!?
రెక్కలు ఎగిరేసిన ఎన్ని నిశ్శబ్దాలను
వారిరువురు పంచుకు౦టూ సేద తీరారో...
రుతువులన్నీ అక్కడ వేచి ఉన్నా..ఏమీ తెలియనట్లే..!!’
రుతువులన్నీ వాళ్ళ ముంగిట వేచివున్న ఏమీ తెలియనట్లున్నారని చెబుతూ... కవిత్వపు ప్రేమతో వారికున్న మమేకతను స్ఫురింప చేసి “ఆ రాతిరి... అదే రాతిరి .వెన్నెలనంతా కప్పేసిన చంద్రుడు వారిరువురిని ఎప్పటిలాగే అమలినంగా మిగిల్చాడు..”- అని అంటూ ఆ ఇరువురి ప్రేమ ’ ప్లాటోనిక్ లవ్ ‘ ఏమో అనే ఊహని పాఠకులకు కలిగిస్తాడు. వాచ్యంగా చెప్పకుండా కేవలం ధ్వనితో చెప్పే కళ సురేష్ లో పువ్వులో పరిమళంలా దాగుంది.
మనసు పడిన అలసట పెదాల్లో ప్రతిష్టితమై కవిత గా మారితే ఎలా వుంటుందంటే వొక అవిశ్రాంత ప్రేమ దిగులు పడేలా వుంటుందని సురేష్ అంటాడు.
“ఒకవేళ.
నీవు నీ నుండి దూరమై ఆవిరై పోతే..
నాకంటూ చెప్పడానికి ఏమీ మిగల్చని ఓ ఖాళీ సమయం..
ఎందుకంటావ్.?
..
మనిద్దరికీ తెలీకుండానే
ఆ గులాబీలు మన ఆత్మ సౌందర్యంగా
మిగలాలని ఆశించడం ...
నాకిదే మొదటిదంటే మొదటి అనుభవం “.
మౌనంగానే వుంటూ ఆమె అతను చాలా మాట్లాడుకొంటారట భాషలకతీతంగా.అది ఎట్లా అని తెలుసుకోవాలంటే సురేష్ కవిత్వ గులాబీల సౌరభాన్ని ఆస్వాదించాల్సిందే.
“ఎన్ని ప్రవాహాలు మన మధ్య
ఎడతెరిపి లేకు౦డా కురిసినవి...!
కొన్ని బోగన్ విల్లా పువ్వుల్ల విహరిస్తూ.....
మరికొన్ని పున్నాగ పూలలా...
కదిలే కాలానికి తూరుపుపడుతూ
చాలా సార్లన్నావు
ఈ క్షణాలను అలాగే పట్టేసుకొ౦టే బావు౦టుంది కదా! అని”
“ To whoever is not listening to the sea
this Friday morning, to whoever is cooped up
in house or office, factory or woman
or street or mine or harsh prison cell;
to him I come, and, without speaking or looking,
I arrive and open the door of his prison,
and a vibration starts up, vague and insistent,
a great fragment of thunder sets in motion
the rumble of the planet and the foam,
the raucous rivers of the ocean flood,
the star vibrates swiftly in its corona,
and the sea is beating, dying and continuing.”

“poets obligation “ అనే ఆంగ్ల కవిత లోనివి ఈ వాక్యాలు. ఈ కవితను ఫ్లాబో నెరూడా రాశాడు. ఇక్కడ ఎందుకు పేర్కొంటున్నానంటే.. సురేష్ లోని అనుసృజన నిపుణతను చెప్పాలనే.కేవలం పదానువాదం లేదా భావానువాదం కాకుండా కవి హృదయపు అనువాదం చేయగలిగితేనే ఆ కవిత నిలుస్తుంది. రారా గారు అనువాదాన్ని ఒక కళ గా భావించారు. సురేష్ పైన ఉదాహారించిన ఫ్లాబో నెరూడాను ఎట్లా తర్జుమా చేశాడో చూడండి.
“ఈ శుక్రవారపు ఉదయాన,
ఆ సముద్రాన్ని వినని వాళ్ళెవరైనా ఉంటె, వారికీ..
ఇంట్లోనో, తమ ఆఫీస్ లోనో, ఫ్యాక్టరీ లోనో
మహిళలతోనో, వీధుల్లోనో,
నాతోనో, ఆ కరుకు చెరసాల గదుల్లోనో మగ్గిపోతున్న వారివద్దకూ
నేనే వస్తాను ..వాళ్ళ బంధాల తలుపుల్ని స్వయంగా తెరుస్తాను.
అప్పుడు ఒక ప్రకంపన మొదలవుతుంది..
అస్పష్టమైనవేవైనా చుట్టుకొనివుంటే,,
అక్కడ ఒక భీకర పెనుతుఫాను తునకను
చలనావస్థ లో పెడతాను..
అప్పుడు...
భోగోళపు ఉరుముల ధ్వని, ఆ నురగ,
సముద్రపు వరద లో గట్టిగ అరుస్తూ కలిసిన నదులు
చుక్కలు కాంతి వలయం లో అతివేగంగా కంపించడం..
సాగరం ఏకబిగిన తీరాన్ని కొడుతూ,...మరణిస్తూ....ఉంటాయి..! “
“To whoever is no tlistening to the sea “- అని ఫ్లాబో నెరూడా కవితను ఆరంభిస్తే సురేష్ “ ఈ శుక్రవారపు ఉదయాన ఆ సముద్రాన్ని “ అని ప్రారంభించాడు. ఇదే అనువాదపు మెళుకువ మెలుకువ.ఈ కళని సురేష్ మరింత అభ్యాసం చేయగలిగితే పర్ఫెక్షన్ సాధించగలుగుతాడు.
‘ఎమిలీ డికిన్ సన్ “ అనే ఆంగ్ల కవి అంటాడు ఇలా “ I Have No Life But This “ అనే ఆంగ్ల కవితలో..
“ I have no life but this,
To lead it here ,
Nor any death,but lest
Dispelled from there,
Nor tie to earts to come,
Nor action new,
Except through this extent,
The realm of you “
“ Reluctance “ – అనే ఆంగ్ల కవితలో రాబర్ట్ ఫ్రాస్ట్ ఇలా అంటాడు.
Out through the fields and the woods
And over the walls I have wended
I have climbed the hills of view
And looked at the world,and descended,
I have come by the highway home.
And lO. it is ended “
ఈ ఇద్దరు కవులను ఇక్కడ ప్రస్తావించడానికి కారణం సురేష్ వాళ్ళిద్దరు నచ్చారని కాదు. “ I Have No Life But This ‘ –అని ఎవరు అనుకోకూడదని. జీవితపు కొండ శిఖరం పైనుంచి ఈ ప్రపంచాన్ని దర్శించమని చెప్పడానికి. “నమూనా బ్రతుకు” అనే కవితలో సామాన్యుని వస్తువు చేసి మంచి కవిత్వం చేశాడు ఈ కవి.
“నీవెప్పుడూ.......నా స్వప్నపు అంచున వ్రేలాడే ఆనందానివే!!!”- అనుకొంటూ కవిత్వాన్ని తన కల అంచున వ్రేలాడ దీసుకున్న కవి సురేష్. అమ్మనే కాదు నాన్నను కూడా అద్భుతంగా కవిత్వంలో పొదిగాడు
‘ ఉరకలెత్తే అలని
ఏ తీరానికి చేర్చాలో తెలిసిన మర్మానివి..
బిక్కు బిక్కుమనే అధైర్యపు క్షణాలను
లెక్కపెట్టి మరీ ఏరిపారేసిన ధైర్యానివి.....!
.........
నోరు తిరగని ఎన్నో పదాలతో
ఎదురొడ్డి
వాటిని అక్కున చేర్చిన భాషవీ ....శబ్ధరత్నాకరానివి
నాన్నవి......!’
రాలే ఆకులవలే వున్న తన జీవితానుభూతుల్ని కవిత్వం చేయడం కవుల చేస్తుంటారు.ఆకుల్లోనుంచి చల్లని తుంపర రాల్చినట్టు కవిత్వంలో అనుభూతుల తుంపరల్ని కవిత్వంలో రాల్చడం సురేష్ కు బాగా తెలుసు. అద్దాల్ని ముక్కల్ని చేసీ గాయాలు చేసేది ప్రేమ.ఆ ప్రేమను గాయం రెచ్చిన ఏడుపుతోనే దాహం తీరిన జ్ఞాపంగా చేస్తాడు సురేష్.
“పూలనట్లా వదిలేయ్
కాగితం మీద అవి ఎంతోసేపు పరిమళించవు “
అని అన్నాడు నంద కిశోర్ అనే యువకవి.కానీ నీ కవిత్వపు పరిమళించాలంటే పుస్తకం గా రావాలని కోరుకుంటు.. అభినందనలతో.

No comments:

Post a Comment